దేశం లోనే ప్రప్రధమముగా జనవరి 19న మహిళా సాయి భక్తుల సమ్మేళనము గుంటూరు జిల్లా, పొన్నూరు

దేశం లోనే ప్రప్రధమముగా జనవరి 19న మహిళా సాయి భక్తుల సమ్మేళనము గుంటూరు జిల్లా, పొన్నూరు  

గుంటూరు జిల్లా, పొన్నూరు  పట్టణములోని శ్రీ సహస్ర లింగేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో గల కళ్యాణ మండపం నందు తేది.19-1-2014 ఆదివారం ఉదయం గం9-00ల నుండి సాయంత్రం గం.5-00ల వరకు. ఈ సమ్మేళనము ప్రప్రధమముగా శ్రీమతి సాయి లీలమ్మ గారి ఆశీస్సులతో జరుగును. ఈ కార్యక్రమము ప్రముఖ బాబాతత్వవేత్త, ప్రముఖ రచయిత ఆలూరు గోపాలరావు గారి సారధ్యంలో జరుగుతున్నది. వివరములకు క్రింది నెంబర్లను సంప్రదించగలరు. 08643-236818, 98490 01328

 ఓం సాయిరాం

సింహాద్రి అప్పన్న వెలసిన సింహాచలం క్షేత్రం

సింహాద్రి అప్పన్న వెలసిన సింహాచలం క్షేత్రం 
విశాఖపట్టణం పరిధిలో సింహాద్రి అప్పన్న భక్తులచే పిలవబడే లక్ష్మీనరసింహస్వామి కొలువైన దివ్యక్షేత్రం సింహాచలం. సింహగిరి కొండపై వెలసిన ఈ స్వామిని దర్శించుకోవడానికి నిత్యం వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. దక్షిణ భారత దేశంలో కొలువైన వైష్ణవ క్షేత్రాల్లో ప్రముఖమైనదిగా పేర్కొనబడుతోన్న ఈ ఆలయానికి తిరుమల తర్వాత అంతటి పేరుండడం గమనార్హం. 

స్థల పురాణం 
అలనాడు విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడు సింహాచలంలోని నహసింహ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించాడని ప్రతీతి. తన తండ్రి, రాక్షసుడైన హిరణ్యకశిపుడు విష్ణువును చూపించమంటూ స్థంభాన్ని పగులగొట్టిన సమయంలో అందులోంచి మహావిష్ణువు నరసింహుడి అవతారంలో ప్రత్యక్షమై హిరణ్యకశిపుడిని సంహరించాడన్న పురాణ కథ అందరికీ తెలిసిందే.

ఇలా తనకోసం ప్రత్యక్షమైన నరసింహుడి అవతారాన్ని ప్రహ్లాదుడు మొదటగా సింహాచలంలో ప్రతిష్టించాడని పురాణాలు చెబుతున్నాయి. అయితే సింహాచలంలోని ఆలయాన్ని మాత్రం పురూరవుడనే రాజు నిర్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి. పురూరవుడు సింహాచలం ప్రాంతాన్ని సందర్శించిన సందర్భంలో ఇక్కడ నేలలో కప్పబడిన నరసింహస్వామి విగ్రహం బయటపడింది.

దాంతో ఆరాజు ఇక్కడ ఆలయాన్ని నిర్మించాడని అలాగే ఈ సందర్భంగా ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు స్వామివారిని ఎల్లప్పుడూ చందనం పూతతోనే ఉంచే ఏర్పాటు చేశారు. అలా ఆనాడు మొదలైన ఆచారమే నేటికీ కొనసాగుతోంది. స్వామివారిని ఏడాదిలో 12 రోజులు తప్ప మిగిలిన రోజులంతా చందనం పూతతోనే దర్శించాల్సి ఉంటుంది.

క్షేత్ర విశేషాలు
సింహాచలంలో ఉండే స్వామివారి గాలిగోపురంకు ఓ ప్రత్యేకత ఉంది. అన్ని దేవాలయాల్లో ఉన్నట్టు తూర్పు ముఖంగా కాకుండా సింహాచలంలోని గాలిగోపురం పడమర ముఖంగా ఉంటుంది. అలాగే ఇక్కడ గర్భగుడికి ఎదురుగా ఉండే ద్వజస్థంభాన్ని కప్ప స్థంభం అని వ్యవహరిస్తారు. గతంలో ఇక్కడే కప్పం అనబడే పన్నులు చెల్లించేవారని అందుకే కాలగమనంలో ఈ స్థంభానికి కప్ప స్థంభం అనే పేరు వచ్చిందని చెబుతుంటారు.

సింహాచలం కొండపై అక్కడక్కడా జలధారలు ప్రవహిస్తుంటాయి. భక్తులు వీటిలో స్నానం చేసి స్వామివారిని దర్శిస్తారు. వీటిలో గంగధార, ఆకాశధార, చక్రధార, మాధవధార అనేవి ముఖ్యమైనవి.

అరసవల్లి లో ఉన్న శ్రీ సూర్య నారాయణ ఆలయం

 అరసవల్లి లో ఉన్న శ్రీ సూర్య నారాయణ ఆలయం
శ్రీకాకుళం జిల్లా లో అరసవల్లి లో ఉన్న శ్రీ సూర్య నారాయణ ఆలయాన్ని ఏడవ శతాబ్దంలో కళింగరాజు దేవేంద్రవర్మ నిర్మించాడని ఇక్కడ లభిస్తున్న శాసనాల వల్ల తెలుస్తున్నది. ఇక్కడి సూర్యదేవాలయం లో కల ఈ స్వామిని స్వయంగా దేవేంద్రుడే ప్రతిష్ఠించాడని స్థలపురాణం ద్వార తెలియుచున్నది. హర్షవల్లి అనే ప్రాచీన పేరు అరసవల్లిగా మారిందనేది చరిత్రకారుల అభిప్రాయం. ఈ ప్రాంతం 17 వ శతాబ్దంలో నిజామునవాబు పాలన క్రిందికి వచ్చింది. ఈ ప్రాంతానికి సుబేదారుగా నియమించబడ్డ షేర్ మహమ్మద్ ఖాన్ పరిపాలనా కాలంలో ఈ ప్రాంతంలోని దేవాలయాలను అనేకం ధ్వంసం చేశాడు. ఆ విషయాన్ని అతనే పర్షియన్ లిపిలో ఒక శిలాశాసనం ద్వారా ప్రకటించుకున్నాడు. అలా నాశనం చేయబడిన అనేక దేవాలయాలలో అరసవిల్లి కూడా వుంది. సుబేదారుకు హిందువుల న్యాయశాస్త్రం గురుంచి, మనుస్మృతి గురించి చెప్పడానికి నియమించబడిన పండితుడు సీతారామ శాస్త్రి అరసవిల్లి దేవాలయంపై జరగనున్న దాడిని గురించి ముందుగా తెలుసుకొని ఎలాగో స్వామి మూలవిరాట్టును పెకలించి ఒక బావిలో పడవేయించాడట.
150 సంవత్సరాల క్రితం ఎలమంచి పుల్లజీ పంతులు అనే ఆయన బావిలోనుంచి ఆ విగ్రహాన్ని తీయించాడట. దేవాలయాన్ని ఇప్పుడున్న రీతిలో నిర్మించి , అందులో బావిలో లభించిన విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. అప్పటి నుంచి ఈ దేవాలయం క్రమక్రమముగా అభివృద్ది చెందుతూ, అశేషంగా భక్తులనెందరినో ఆకర్షిస్తూ ప్రముఖ పుణ్యక్షేత్రముగా వెలుగొందుతూ వుంది. ఈ దేవాలయంలో సంవత్సరానికి రెండు పర్యాయాలు సూర్య కిరణాలు ఉదయసంధ్యలో గర్బ గుడిలో ఉన్న మూలవిరాట్టు పాదాలకు సోకేలా నిర్మించబడటం ఒక ప్రత్యేకత. శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయమైన ఉషా పద్మినీ ఛాయా సమేత శ్రీ నారాయణ స్వామిని సూర్య కిరణాలు తాకుతాయి.అరసవల్లి దేవస్థానం ప్రాంగణం అనివెట్టి మండపం, ధ్వజస్తంభం నుంచి సుదర్శన ద్వారం మధ్యలో తొలి కిరణాలు గర్భగుడిలోకి మాలవిరాట్టు ఆదిత్యుని శిరస్సును సృశిస్తాయి. ఆదిత్యునిని సూర్యకిరణాలు తాకిన వైనాన్ని తిలకించేందుకు తండోపతండాలుగా భక్తకోటి అరసవల్లికి తరలివస్తారు. సకల జీవులకూ సంక్షేమాన్ని, ఆయురారోగ్యాలనూ, ప్రసాదించే ఈ స్వామివారి ఇరు చేతులూ అభయ ముద్రలోనే ఉంటాయి. మాములు రోజులతో పోలిస్తే మాఘ, వైశాఖ, కార్తీక మాసాల ఆదివారాల్లో ఈ క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అందులో ముఖ్యంగా రథసప్తమినాడు ఆ సంఖ్య లక్షల్లోకి చేరుకుంటుందన్న విషయం అందరికీ తెలిసిందే.అలాగే ఉత్తరాయణ, దక్షిణాయన మార్పుల్లో భాగంగా ప్రతిఏటా మార్చి 9, 10, 11, 12 తారీఖుల్లోనూ, అక్టోబర్ 1, 2, 3, 4 తేదీల్లోనూ, స్వామివారి, ధ్రువమూర్తిపై ఆదిత్యునిని తొలికిరణాలు తాకుతాయి. స్వామి పాదాల మీదుగా మొదలై శిరోభాగం వరకూ సూర్యకిరణాలు ప్రసరించే అద్భుత, అపురూపమైన దృశ్యాన్ని తిలకిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని ప్రతీతి. ఇకపోతే... అరసవల్లి క్షేత్రాన్ని ఆరోగ్య క్షేత్రంగానూ స్థానికులు పిలుస్తుంటారు. ప్రత్యేకించి బొల్లి, కంటి వ్యాధులు, కుష్టు, వ్యాధులతో పాటు ఇతర మానసిక, శారీరక రోగాల నుంచి విముక్తి కోసం బాధిత భక్తులు ఇక్కడికొచ్చి స్వామి వారిని దర్శించుకుంటుంటారని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. నేడు తుఫాను కారణంగా ఆకాశం మబ్బులు పట్టడంతో ఆందోళన చెందిన భక్తులకు సూర్యకిరణాలు మూడు నిముషాలసేపు మూలవిరాట్టు పాదాలపై పడడంతో భక్తుల ఆనందానికి అంతులేకుండా పోయింది.