Sree Lakshmi Narayani Golden Temple | శ్రీ లక్ష్మీనారాయణి “స్వర్ణ దేవాలయం” ఎక్కడవుందో..?


Sree Lakshmi Narayani Golden Temple Tamil Nadu | శ్రీ లక్ష్మీనారాయణి “స్వర్ణ దేవాలయం” ఎక్కడవుందో..? 

శ్రీ లక్ష్మీ నారాయణి “స్వర్ణ దేవాలయం” తమిళనాడు రాష్ట్రంలో వేలూరు “మలైకుడి” అనే ప్రాంతానికి దగ్గర్లో కొండల దిగువున దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడినది. చెన్నై నుంచి సుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
దీని నిర్మాణసారధి “నారాయణి అమ్మ” అనే స్వామి. ఆయనను “శక్తి సిద్ధ” అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ స్వర్ణ దేవాలయం 55,000 చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించబడింది. దీని “గర్భ గుడి” సుమారు 1.5 మెట్రిక్ టన్నుల అసలు సిసలైన “బంగారం”తో చేసిన మందపాటి రేకులతో కప్పబడి ఉండటం వలన దీనికి “స్వర్ణ దేవాలయం”అని పేరు వచ్చింది. 

ఆలయ ఆవరణం “నక్షత్రం” ఆకారంలో ఉంటుంది. గుడిలోకి ప్రవేశించే దారి పొడవునా భగవద్గీత, ఖురాన్, బైబిల్, గురుగ్రంథ్ సాహిబ్ నుండి సేకరించిన శ్లోకాలతో పొందుపరచ బడి ఉంటాయి.

ప్రతి శుక్రవారం ఇక్కడికి వచ్చే భక్తుల దర్శనాన్ని పర్యవేక్షించడానికి సుమారు 700 మంది పోలీసులను ప్రభుత్వం నియమించింది. ఇక్కడ “ఆగమ శాస్త్రాల ప్రకారం పూజలు చెయ్యరు”. కాని “శ్రీ విద్య” అనే ప్రాచీనమైన, అరుదైన “శక్తి పూజా” విధానాన్ని అనుసరిస్తారు.
నారాయణి అమ్మ స్వామి ఏర్పాటు చేసిన సంస్థకు సుమారు ఆరు దేశాల్లో కార్యాలయాలు ఉన్నాయి. ఆలయ నిర్మాణానికి అవసరమైన నిధులు దీని ద్వారానే లభించాయని ఆయన తెలియజేశారు. 

ఆయన అంతకు మునుపే పేదరిక నిర్మూలనకూ, వికలాంగులకూ సహాయం చేశారు. మూడు కోట్ల రూపాయలతో చుట్టుపక్కల ఉన్న దాదాపు 600 దేవాలయాలను “జీర్ణోద్ధరణ” కూడా కావించారు.
ఇక్కడ విశేషమేమంటే, ఈ దేవాలయములో గర్భగుడికి “మూడు వైపులా” నీరు, ఒకవైపు ద్వారం వుంటుంది. ఇక్కడకు వచ్చే భక్తులు ఆ నీటిని పవిత్రమైనదిగా భావిస్తారు.

ఇవిగో..ఆ స్వర్ణ దేవాలయ అపురూప చిత్రాలు .. చూసి తరించండి..!! శుభం భూయాత్ 
















–  ఫణి ప్రసాద్ యాల్లజోస్యుల.


ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ 'వైష్ణవాలయం లేదా విష్ణుదేవాలయం కాంభోజ దేశం లో ?


ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ 'వైష్ణవాలయం' లేదా 'విష్ణుదేవాలయం' మన భారతదేశంలో లేదని ..! అది 'కాంభోజ దేశం' లో వుందని ..? ఆదేశం ఎక్కడ వుందో ..! దాని పూర్తి “కధ – కమామీషు”లు .. ఇదిగో ..ఇక్కడ చదవండి.. చూడండి ..!!

“Angkor Wat” (లేదా Angkor Vat) ఒక ప్రపంచ వారసత్వ ప్రదేశం, కంబోడియా లేదా కాంబోడియా (ప్రాచీన నామం 'కంపూచియా') లోని “అంగ్ కోర్” వద్ద 12వ శతాబ్దంలో సూర్యవర్మన్ II నిర్మించారు. ఇది 'వైష్ణవాలయం' లేదా 'విష్ణుదేవాలయం'. ఇది ఖ్మేర్ నిర్మాణ శైలి లో నిర్మింపబడింది. ఇప్పటివరకూ, ప్రపంచంలోనే అతిపెద్ద విష్ణుదేవాలయం.
ఆంగ్‌కోర్‌ వాట్‌ దేవాలయం కంపూచియాలోని సీమ్‌ రీప్‌ పట్టణానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయానికి కొన్ని దశాబ్దాల చరిత్ర ఉంది. టోనెల్‌ సాస్‌ సరస్సు తీరాన సుమారు 200 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఎంతో విశాలమైన ప్రాంగణంలో ఎన్నో దేవాలయాల సముదాయంతో ఆహ్లాద భరితంగా ఉంటుంది.
క్రీ.శ 12వ శతాబ్దకాలంలో ఆంగ్‌కోర్‌ వాట్‌ను రాజధానిగా చేసుకుని పాలించిన రెండవ సూర్యవర్మన్‌ కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు చరిత్ర చెబుతోంది. దీన్ని నిర్మించడానికి సుమారు 30 సంవత్సరాలు పట్టిందట.
భారతీయ సంస్కృతి ఆనవాళ్లే లేని “కంపూచియా”లో ఇంతపెద్ద హిందూ దేవాలయాన్ని ఎలా? ఎందుకు? నిర్మించారనే ప్రశ్న తలెత్తే ఉంటుంది కదా?

అసలు విషయానికొస్తే, ప్రస్తుతం కంపూచియాగా పిలవబడే ఈ దేశాన్ని పూర్వకాలంలో 'కాంభోజ దేశం' అని పిలిచేవారు. సంస్కృత పదాలను సరిగ్గా ఉచ్ఛరించలేని యూరోపియన్లు, కాంభోజ దేశాన్ని “కంబోడియా”గా మార్చేశారు. యూరోపియన్‌ వలస దేశాల అజమాయిషీలోకి వెళ్లిన తర్వాత కాంభోజ దేశం కాలక్రమంలో “కంపూచియా”గా మారిపోయింది.
పూర్వకాలంలో, కాంభోజ దేశంలో హిందూ సంస్కృతే ఎక్కువగా ఉండేది. 9-15 శతాబ్దాల కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించిన రెండవ సూర్యవర్మతో పాటు అనేకమంది “హిందూ రాజులు” కంపూచియాను పాలించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. “చైనా” రికార్డుల ప్రకారం ఈ ప్రాంతమంతా “భరత ఖండానికి” చెందిన రాజుల పాలనలో ఉండేది. భారతీయ పురాతన సంస్కృత గ్రంథాలు కూడా ఈ విషయాన్ని రూఢి చేస్తున్నాయి.(కాంభోజ రాజు కధలు..?)

“చోళ” రాజ్యానికి చెందిన ఒక రాజు, “టోనెల్‌ సాప్‌” నదీ పరీవాహక ప్రాంతాన్ని ఏలుతున్న 'నాగ' అనే రాకుమార్తెను వివాహం చేసుకుని ఇక్కడ రాజ్యాన్ని ఏర్పాటు చేసినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. “ఖ్మేర్‌” సామ్రాజ్య పురాణగాథల ప్రకారం ఖ్మేర్‌ సామ్రాజ్యాధినేత అయిన 'కాము'తో భరత ఖండానికి సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఖ్మేర్‌ నాగరికత తర్వాత కొన్ని శతాబ్దాల అనంతరం భారతీయ సంస్కృతి కంపూచియాకు వ్యాపించింది. “సంస్కృతం” అధికారభాషగా హిందూ, బౌద్ధమతాలు అధికార సంప్రదాయాలుగా వెలుగొందాయి.
జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా దర్శించాలనుకునే పర్యాటక ప్రాంతాల్లో ఆంగ్‌కోర్‌ వాట్‌ దేవాలయం ఒకటి. హిందూ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించే అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం ఇక్కడ కనిపిస్తుంది. భారతీయ ఇతిహాసాలను తనలో ఇముడ్చుకుని అందరినీ ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఈ దేవాలయం ఆ దేశ జాతీయ పతాకంలో కూడా స్థానం సంపాదించుకుంది.
ఖ్మేర్‌ సామ్రాజ్యంలో ఈ అద్భుత కట్టడానికి అంకురార్పణ జరిగింది. ఈ దేవాలయ నిర్మాణం మన దేశంలోని తమిళనాడు దేవాలయాలను పోలి ఉంటుంది. తమిళనాడుకు చెందిన చోళరాజుల నిర్మాణ పద్ధతులు ఈ దేవాలయాల్లో కనిపిస్తాయి. అయితే ఈ దేవాలయాలన్నీ మిగతా వాటికి భిన్నంగా పశ్చిమ ముఖద్వారాన్ని కలిగి ఉన్నాయి.
భారతదేశంలో కూడా ఇప్పటివరకు, ఇంత పెద్ద దేవాలయం లేదనే చెప్పాలి. అద్భుతమైన వాస్తు రీతితో ఈ దేవాలయాన్ని రూపొందించారు. కులేన్‌ పర్వత శ్రేణుల పాదాల చెంత నిర్మించబడ్డ ఈ దేవాలయం ప్రపచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా, విష్ణుమూర్తి ఆలయంగా వెలుగొందుతోంది. ఇందులోని ఆలయాలన్నీ హిందూ సంస్కృతికి దగ్గరగా ఉంటాయి. ఆ దేవాలయాన్ని చూసి హిందూ ధర్మ/మతం గొప్పదని తెలుసుకొని .. గర్వపడుదాం..!! శుభం భూయాత్ .!







దేశం లోనే ప్రప్రధమముగా జనవరి 19న మహిళా సాయి భక్తుల సమ్మేళనము గుంటూరు జిల్లా, పొన్నూరు

దేశం లోనే ప్రప్రధమముగా జనవరి 19న మహిళా సాయి భక్తుల సమ్మేళనము గుంటూరు జిల్లా, పొన్నూరు  

గుంటూరు జిల్లా, పొన్నూరు  పట్టణములోని శ్రీ సహస్ర లింగేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో గల కళ్యాణ మండపం నందు తేది.19-1-2014 ఆదివారం ఉదయం గం9-00ల నుండి సాయంత్రం గం.5-00ల వరకు. ఈ సమ్మేళనము ప్రప్రధమముగా శ్రీమతి సాయి లీలమ్మ గారి ఆశీస్సులతో జరుగును. ఈ కార్యక్రమము ప్రముఖ బాబాతత్వవేత్త, ప్రముఖ రచయిత ఆలూరు గోపాలరావు గారి సారధ్యంలో జరుగుతున్నది. వివరములకు క్రింది నెంబర్లను సంప్రదించగలరు. 08643-236818, 98490 01328

 ఓం సాయిరాం

సింహాద్రి అప్పన్న వెలసిన సింహాచలం క్షేత్రం

సింహాద్రి అప్పన్న వెలసిన సింహాచలం క్షేత్రం 
విశాఖపట్టణం పరిధిలో సింహాద్రి అప్పన్న భక్తులచే పిలవబడే లక్ష్మీనరసింహస్వామి కొలువైన దివ్యక్షేత్రం సింహాచలం. సింహగిరి కొండపై వెలసిన ఈ స్వామిని దర్శించుకోవడానికి నిత్యం వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. దక్షిణ భారత దేశంలో కొలువైన వైష్ణవ క్షేత్రాల్లో ప్రముఖమైనదిగా పేర్కొనబడుతోన్న ఈ ఆలయానికి తిరుమల తర్వాత అంతటి పేరుండడం గమనార్హం. 

స్థల పురాణం 
అలనాడు విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడు సింహాచలంలోని నహసింహ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించాడని ప్రతీతి. తన తండ్రి, రాక్షసుడైన హిరణ్యకశిపుడు విష్ణువును చూపించమంటూ స్థంభాన్ని పగులగొట్టిన సమయంలో అందులోంచి మహావిష్ణువు నరసింహుడి అవతారంలో ప్రత్యక్షమై హిరణ్యకశిపుడిని సంహరించాడన్న పురాణ కథ అందరికీ తెలిసిందే.

ఇలా తనకోసం ప్రత్యక్షమైన నరసింహుడి అవతారాన్ని ప్రహ్లాదుడు మొదటగా సింహాచలంలో ప్రతిష్టించాడని పురాణాలు చెబుతున్నాయి. అయితే సింహాచలంలోని ఆలయాన్ని మాత్రం పురూరవుడనే రాజు నిర్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి. పురూరవుడు సింహాచలం ప్రాంతాన్ని సందర్శించిన సందర్భంలో ఇక్కడ నేలలో కప్పబడిన నరసింహస్వామి విగ్రహం బయటపడింది.

దాంతో ఆరాజు ఇక్కడ ఆలయాన్ని నిర్మించాడని అలాగే ఈ సందర్భంగా ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు స్వామివారిని ఎల్లప్పుడూ చందనం పూతతోనే ఉంచే ఏర్పాటు చేశారు. అలా ఆనాడు మొదలైన ఆచారమే నేటికీ కొనసాగుతోంది. స్వామివారిని ఏడాదిలో 12 రోజులు తప్ప మిగిలిన రోజులంతా చందనం పూతతోనే దర్శించాల్సి ఉంటుంది.

క్షేత్ర విశేషాలు
సింహాచలంలో ఉండే స్వామివారి గాలిగోపురంకు ఓ ప్రత్యేకత ఉంది. అన్ని దేవాలయాల్లో ఉన్నట్టు తూర్పు ముఖంగా కాకుండా సింహాచలంలోని గాలిగోపురం పడమర ముఖంగా ఉంటుంది. అలాగే ఇక్కడ గర్భగుడికి ఎదురుగా ఉండే ద్వజస్థంభాన్ని కప్ప స్థంభం అని వ్యవహరిస్తారు. గతంలో ఇక్కడే కప్పం అనబడే పన్నులు చెల్లించేవారని అందుకే కాలగమనంలో ఈ స్థంభానికి కప్ప స్థంభం అనే పేరు వచ్చిందని చెబుతుంటారు.

సింహాచలం కొండపై అక్కడక్కడా జలధారలు ప్రవహిస్తుంటాయి. భక్తులు వీటిలో స్నానం చేసి స్వామివారిని దర్శిస్తారు. వీటిలో గంగధార, ఆకాశధార, చక్రధార, మాధవధార అనేవి ముఖ్యమైనవి.

అరసవల్లి లో ఉన్న శ్రీ సూర్య నారాయణ ఆలయం

 అరసవల్లి లో ఉన్న శ్రీ సూర్య నారాయణ ఆలయం
శ్రీకాకుళం జిల్లా లో అరసవల్లి లో ఉన్న శ్రీ సూర్య నారాయణ ఆలయాన్ని ఏడవ శతాబ్దంలో కళింగరాజు దేవేంద్రవర్మ నిర్మించాడని ఇక్కడ లభిస్తున్న శాసనాల వల్ల తెలుస్తున్నది. ఇక్కడి సూర్యదేవాలయం లో కల ఈ స్వామిని స్వయంగా దేవేంద్రుడే ప్రతిష్ఠించాడని స్థలపురాణం ద్వార తెలియుచున్నది. హర్షవల్లి అనే ప్రాచీన పేరు అరసవల్లిగా మారిందనేది చరిత్రకారుల అభిప్రాయం. ఈ ప్రాంతం 17 వ శతాబ్దంలో నిజామునవాబు పాలన క్రిందికి వచ్చింది. ఈ ప్రాంతానికి సుబేదారుగా నియమించబడ్డ షేర్ మహమ్మద్ ఖాన్ పరిపాలనా కాలంలో ఈ ప్రాంతంలోని దేవాలయాలను అనేకం ధ్వంసం చేశాడు. ఆ విషయాన్ని అతనే పర్షియన్ లిపిలో ఒక శిలాశాసనం ద్వారా ప్రకటించుకున్నాడు. అలా నాశనం చేయబడిన అనేక దేవాలయాలలో అరసవిల్లి కూడా వుంది. సుబేదారుకు హిందువుల న్యాయశాస్త్రం గురుంచి, మనుస్మృతి గురించి చెప్పడానికి నియమించబడిన పండితుడు సీతారామ శాస్త్రి అరసవిల్లి దేవాలయంపై జరగనున్న దాడిని గురించి ముందుగా తెలుసుకొని ఎలాగో స్వామి మూలవిరాట్టును పెకలించి ఒక బావిలో పడవేయించాడట.
150 సంవత్సరాల క్రితం ఎలమంచి పుల్లజీ పంతులు అనే ఆయన బావిలోనుంచి ఆ విగ్రహాన్ని తీయించాడట. దేవాలయాన్ని ఇప్పుడున్న రీతిలో నిర్మించి , అందులో బావిలో లభించిన విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. అప్పటి నుంచి ఈ దేవాలయం క్రమక్రమముగా అభివృద్ది చెందుతూ, అశేషంగా భక్తులనెందరినో ఆకర్షిస్తూ ప్రముఖ పుణ్యక్షేత్రముగా వెలుగొందుతూ వుంది. ఈ దేవాలయంలో సంవత్సరానికి రెండు పర్యాయాలు సూర్య కిరణాలు ఉదయసంధ్యలో గర్బ గుడిలో ఉన్న మూలవిరాట్టు పాదాలకు సోకేలా నిర్మించబడటం ఒక ప్రత్యేకత. శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయమైన ఉషా పద్మినీ ఛాయా సమేత శ్రీ నారాయణ స్వామిని సూర్య కిరణాలు తాకుతాయి.అరసవల్లి దేవస్థానం ప్రాంగణం అనివెట్టి మండపం, ధ్వజస్తంభం నుంచి సుదర్శన ద్వారం మధ్యలో తొలి కిరణాలు గర్భగుడిలోకి మాలవిరాట్టు ఆదిత్యుని శిరస్సును సృశిస్తాయి. ఆదిత్యునిని సూర్యకిరణాలు తాకిన వైనాన్ని తిలకించేందుకు తండోపతండాలుగా భక్తకోటి అరసవల్లికి తరలివస్తారు. సకల జీవులకూ సంక్షేమాన్ని, ఆయురారోగ్యాలనూ, ప్రసాదించే ఈ స్వామివారి ఇరు చేతులూ అభయ ముద్రలోనే ఉంటాయి. మాములు రోజులతో పోలిస్తే మాఘ, వైశాఖ, కార్తీక మాసాల ఆదివారాల్లో ఈ క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అందులో ముఖ్యంగా రథసప్తమినాడు ఆ సంఖ్య లక్షల్లోకి చేరుకుంటుందన్న విషయం అందరికీ తెలిసిందే.అలాగే ఉత్తరాయణ, దక్షిణాయన మార్పుల్లో భాగంగా ప్రతిఏటా మార్చి 9, 10, 11, 12 తారీఖుల్లోనూ, అక్టోబర్ 1, 2, 3, 4 తేదీల్లోనూ, స్వామివారి, ధ్రువమూర్తిపై ఆదిత్యునిని తొలికిరణాలు తాకుతాయి. స్వామి పాదాల మీదుగా మొదలై శిరోభాగం వరకూ సూర్యకిరణాలు ప్రసరించే అద్భుత, అపురూపమైన దృశ్యాన్ని తిలకిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని ప్రతీతి. ఇకపోతే... అరసవల్లి క్షేత్రాన్ని ఆరోగ్య క్షేత్రంగానూ స్థానికులు పిలుస్తుంటారు. ప్రత్యేకించి బొల్లి, కంటి వ్యాధులు, కుష్టు, వ్యాధులతో పాటు ఇతర మానసిక, శారీరక రోగాల నుంచి విముక్తి కోసం బాధిత భక్తులు ఇక్కడికొచ్చి స్వామి వారిని దర్శించుకుంటుంటారని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. నేడు తుఫాను కారణంగా ఆకాశం మబ్బులు పట్టడంతో ఆందోళన చెందిన భక్తులకు సూర్యకిరణాలు మూడు నిముషాలసేపు మూలవిరాట్టు పాదాలపై పడడంతో భక్తుల ఆనందానికి అంతులేకుండా పోయింది.