ఆత్మలింగ క్షేత్రం గోకర్ణం

ఆత్మలింగ క్షేత్రం గోకర్ణం

మనదేశంలోని అత్యంత ప్రాచీనమైన శైవక్షేత్రాలలో గోకర్ణం ఒకటి. పవిత్రమైన త్రిస్థలాలలో గోకర్ణం ఒకటి. మిగతా రెండు వారణాశి, రామేశ్వరం. గోకర్ణక్షేత్రానికి పడమట అరేబియా సముద్రం, తూర్పున సిద్ధేశ్వరక్షేత్రం, ఉత్తరాన గంగావళినది, దక్షిణాన అగనాశిని నది ఉన్నాయి. ఇలా ప్రకృతి రమణీయతతో అలరారుతుండే ఈ క్షేత్రంలో శివుని ఆత్మలింగం ప్రతిష్టితమైంది.
పురాణ కథ

ఈ పుణ్యక్షేత్ర ప్రసక్తిని రామాయణ, మహాభారతాలలో చూడగలం. ఇక స్కాందపురాణంలో ఒక అధ్యాయమే ఈ క్షేత్ర ప్రాముఖ్యాన్ని వివరిస్తోంది. పూర్వం రావణాసురుడు శివుని గురించి ఘోరమైన తపస్సు చేయగా, అతని తపస్సును మెచ్చి ప్రత్యక్షమైన శివుడు వరాన్ని కోరుకొమ్మన్నాడు. అప్పుడు రావణాసురుడు తనకు ఆత్మలింగం కావాలని కోరాడు. అందుకు ఓ నిబంధన విధించిన శివుడు, రావణాసురునికి ఆత్మలింగాన్ని ఇచ్చాడు. ఆ నిబంధన ప్రకారం, రావణాసురుడు లంకకు వెళ్ళేంతవరకు ఆత్మలింగాన్ని నేలపై దించుకూడదు. ఆత్మలింగాన్ని అందుకున్న రావణాసురుడు లంకవైపు పరుగులు తీయసాగాడు. ఆత్మలింగం రావణాసురుని దగ్గరే ఉంటే లోకాలన్నీ అల్లకల్లోలమైపోతాయని కలత చెందిన దేవతలు, తమను కాపాడవలసిందంటూ విష్ణుమూర్తి, బ్రహ్మ, విష్నేశ్వర తదితర దేవుళ్లను వేడుకోగా, గణపతి చిన్నపిల్లవాని వేషంలో రావణాసురునికి మార్గమధ్యంలో ఎదురుపడతాడు. సరిగ్గా అప్పుడే విష్ణుమూర్తి తన చక్రాయుధాన్ని సూర్యునికి అడ్డంగా పెడతాడు. సాయంత్రం అవుతుందనుకున్న రావణాసురుడు సంధ్యావందనాన్ని నిర్వర్తించాలనుకుంటాడు. అయితే అతని రెండు చేతుల్లో శివుని ఆత్మలింగం ఉంది.
అప్పుడు అటుగా బాలరూపంలో వచ్చిన వినాయకుని చూసిన రావణాసురుడు, కాసేపు ఆత్మలీంగాన్ని పట్టుకొమ్మని, తాను సంధ్యావందనం చేసి వస్తానని అభ్యర్ధిస్తాడు. అందుకు ఒప్పుకున్న బాలవినాయకుడు, తాను మూడుసార్లు పిలుస్తానని, అప్పటికీ రావణాసురుడు రాకపోతే ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తానని చెబుతాడు. వేరే దారిలేని రావణాసురుడు వినాయకుని నిబంధనకు ఒప్పుకుని సంధ్యావందనం చేసుకోడానికి వెళతాడు. అయితే రావణాసురునికి ఏమాత్రం అవకాశాన్ని ఇవ్వని వినాయకుడు, గబగబా మూడుసార్లు రావణాసురుని పిలిచి, ఆత్మలింగాన్ని నేలపై పెట్టేస్తాడు. రావణాసురుడు ఎంతగా పరుగులు పెట్టి వచ్చినప్పటికీ జరగాల్సింది జరిగిపోతుంది. ఆ సంఘటనకు కోపగించుకున్న రావణాసురుడు బాలవినాయకుని తలపై ఒక మొట్టికాయ వేస్తాడు. ఫలితంగా గణపతి తలపై నొక్కు ఏర్పడుతుంది. ఆ నొక్కును ఇప్పటికీ, ఇక్కడున్న మహాగణపతి ఆలయంలోని గణపతి విగ్రహానికి చూడవచ్చు. ఆ తరువాత రావణాసురుడు ఎంతగా ప్రయత్నించినప్పటికీ, ఆత్మలింగాన్ని పైకి లేపలేకపోతాడు. ఆత్మలింగాన్ని తీసుకువచ్చిన పెట్టెను ఉత్తరం వైపు నుంచి లాగుతాడు. అది విసురుగా వెళ్ళి దూరంగా పడిపోతుంది. అక్కడ సజ్జేశ్వర లింగం వెలుస్తుంది. పెట్టె మూతపడిన చోట గుణేశ్వర లింగం ఉద్భవిస్తుంది. లింగంపై కప్పబడిన వస్త్రం పడిన చోట మురుడేశ్వర లింగం వెలుస్తుంది. పెట్టెను కట్టిన (తాళ్ళు) పడినచోట ధారేశ్వరలింగం ఉద్భవిస్తుంది. ఈ లింగాల మధ్య స్వామివారి ఆత్మలింగం మహాబలేశ్వరలింగంగా గోకర్ణంలో వెలుస్తుంది. ఆత్మలింగంతో ముడిపడిన ఐదుక్షేత్రాలను శైవ పంచక్షేత్రాలని పిలుచుకుంటుంటారు.
ఇంకొక కథనం ప్రకారం, పాతాళలోకంలో తపస్సు చేసి, భూలోకానికి వస్తున్నప్పుడు, భూమాత గోరూపాన్ని ధరించిందట. ఆ గోవుచెవి నుండి పరమేశ్వరుడు బయటకు రావడంతో ఈ క్షేత్రనికి గో (ఆవు) కర్ణం (చెవి) = గోకర్ణం అనే పేరు ఏర్పడిందట.
 

పురాతన ప్రాశస్త్యం
దక్షిణకాశి, భూకైలాసం అని భక్తులచే కొనియాడబడుతున్న ఈ క్షేత్రచరిత్ర ఎంతో పురాతనమైనది. కాళిదాసు, తన ‘రఘువంశం’ కావ్యంలో ఈ క్షేత్ర ప్రస్తావన చేసాడు. క్రీ.శ. ఏడవ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన హర్షవర్ధనుడు ‘నాగానంద’ కావ్యంలో ఈ క్షేత్రం గురించి వివరించాడు. కదంబ చక్రవర్తి మయూరశర్మ ఈ ఆలయంలో నిత్యపూజాదికాలైన ఏర్పాట్లు చేసాడనీ, చెన్నమ్మాజీ, ఆమె కుమారుడు సోమశేఖర నాయకుడు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నప్పుడు హళసునాడు – కుందపురానికి చెందిన విశ్వేశ్వరాయుడు చంద్రశాల, నందిమంటపాలను నిర్మించాడని శసనాల ద్వారా తెలుస్తోంది. అనంతరం గోకర్ణం క్షేత్రాన్ని విజయనగర రాజులు అభివృద్ధి చేసారు. క్రీ.శ. 1665వ సంవత్సరంలో ఛత్రపతి శివాజీ ఈ క్షేత్రాన్ని దర్శించుకుని పూజలు చేసాడట.

కోటితీర్థం

గోకర్ణంలో ప్రధానాలయం శ్రీ మహాబలేశ్వరాలయం. ఈ ఆలయంలో స్వామిని దర్శించుకునే ముందు భక్తులు కోటితీర్థంలో స్నానం చేస్తారు. కోటితీర్థంలో స్నానం చేస్తే సమస్తరోగాలు నయమవుతాయని ప్రతీతి. కోటితీర్థంలో స్నానం చేసిన తరువాత భక్తులంతా ప్రక్కనున్న సముద్రంలో స్నానం చేస్తారు. ఆలయానికి ప్రక్కనున్న అరేబియా సముద్రంలో స్నానం చేస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మిక. కోటితీర్థానికి దక్షిణం వైపు అగస్త్యులవారిచే ప్రతిష్ఠింప బడిన వరటేశ్వరలింగం ఉంది. ఈ ఆలయము భక్తుల సౌకర్యార్థం ఇరవైనాలుగు గంటలూ తెరువబడే ఉంటుంది.

మహాబలేశ్వరాలయం

పురాతనమైన ఈ ఆలయం పెద్ద గాలిగోపురంతో భక్తులను ఆహ్వానిస్తుంటుంది. ఈ లింగం కిందివైపు కాస్త వెడల్పుగా, పైన సన్నగా కనబడుతుంటుంది. రావణాసురుడు ఈ శివలింగాన్ని పైకి లాగడనికి ప్రయత్నం చేయడం వల్ల లింగంపై భాగాన సన్నగా ఉందంటారు. పైకి ఉండే ఒక రంధ్రంలో వ్రేలును ఉంచినపుడు కిందనున్న లింగం వ్రేలుకి తగులుతుంది. భక్తులు శివలింగం చుట్టూ కూర్చుని పూజలు నిర్వహిస్తారు. ఈ శివపూజను నిర్వహించడానికి ఒక భక్తునికి ఒక రూపాయి చొప్పున రుసుమును వసూలు చేస్తూంటారు. అయితే, మహామంగళహారతుల సమయంలో గర్భగృహహంలోకి భక్తులను అనుమతించరు. ఇక్కడ పన్నెండు సంవత్సరాల కొకసారి ఒక విశేషమైన కార్యక్రమము జరుగుతుంది. అప్పుడు శివలీంగాన్ని బయటకు తీసి, నిజస్వరూప లింగానికి పూజలు చేస్తారు. ఈ పుష్కర ఉత్సవాలకు దేశవిదేశాల నుండి లక్షలసంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ కార్యక్రమం ఈ సంవత్సరం జరగాల్సి ఉంది. ఇక, ప్రతి సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవాలు ఏడురోజులపాటు ఘనంగా జరుగుతాయి. ఈ సందర్భంగా రథోత్సవం జరుగుతుంది. ఈ ఆలయంలో మధ్యాహ్నం పన్నెండున్నర నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు మంగళహారతి పూజలు జరుగుతుంటాయి. ఆలయంలోకి ప్రవేశించే పురుషులు చొక్కాలను విడిచి, భుజాలపై కండువాలతో స్వామి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది.

తామ్రగౌరీ ఆలయం

మహాబలేశ్వర ఆలయప్రాంగణంలో ఉత్తరం వైపున ఈ ఆలయం ఉంది. ఈమె మహాబలేశ్వరుని పత్ని. ఈమె బ్రహ్మదేవుని కుడిచేయినుండి ఉద్భవించిందని చెబుతారు. ఈ దేవి తపస్సు చేసి రుద్రున్ని వివాహం చేసుకుంది. ఈ ఆలయం ఉదయం ఆరుగంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు, సాయంత్రం ఐదుగంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు తెరిచి ఉంటుంది.

మహాగణపతి ఆలయం

రావణుడు ఆత్మలింగాన్ని తీసుకెళ్తున్నప్పుడు, అతడిని అడ్డుకున్న గణపతి చారుర్యాన్ని మెచ్చుకున్న పరమశివుడు మహాబలేశ్వరక్షేత్రంలో ముందుగా వినాయకుని దర్శించుకున్న తరువాతే భక్తులు తన సన్నిధికి వస్తారని వరమిచ్చాడు. రావణుడు వేసిన మొట్టికాయకు గుర్తుగా ఈ స్వామి తలపై చిన్న పల్లం కనబడుతుంటుంది. ఈ ఆలయం మహాబలేశ్వర ఆలయానికి తూర్పుదిక్కున ఉంది. ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహనం ఒకటిన్నరవరకు, సాయంత్రం నాలుగున్నర నుంచి రాత్రి ఎనిమిదింపావు వరకు ఆలయం తెరిచి ఉంటుంది.

ఇంకా ఈ క్షేత్ర ప్రాంగణంలో భద్రకాళి, కాలభైరవ శ్రీకృష్ణ, నరసింహస్వామి దేవాలయాలున్నాయి. నేత్రాసురుడు అనే రాక్షసుని సంహరించేందుకై, త్రిమూర్తుల శక్తితో భద్రకాళి ఆవిర్భవించారట. అమృతమధనం జరుగుతున్నప్పుడు దేవతలు ఇక్కడకు వచ్చి ఆత్మలింగానికి పూజలు చేయడం వల్ల వారికి అమృతం లభించిందని ప్రతీతి.

గోకర్ణంలో బస చేసేందుకు హోటళ్ళ సౌకర్యం బాగానే ఉంది. గోకర్ణం బెంగుళూరు నుంచి సుమారు 450 కి.మీ దూరంలో ఉంది. హబ్లి, ఉడుపి, మంగళూరు, బెల్గాంల నుండి ఇక్కడికి బస్సు సౌక్యం ఉంది. కొంకణీరైలు మార్గంలో గోకర్ణరోడ్డు స్టేషన్‌కి ఆలయానికి మధ్య ఐదు కిలోమీటర్ల దూరం ఉంది.

గోకర్ణానికి చుట్టుప్రక్కల ఉన్న పుణ్యక్షేత్రాలు

ధారేశ్వర ఆలయం

ఈ ఆలయం గోకర్ణానికి దక్షిణదిక్కున సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఆత్మలింగానికి సంబంధించిన లింగం. ఈ ఆలయం చాళుక్య, హోయిసల శిల్పశైలిలో కనబడుతుంటుంది. దీనిని పదకొండవ శతాబ్దంలో పునర్నిర్మించినట్లు చెప్పబడుతోంది. ఈ ఆలయం ఉదయం ఆరుగంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి తొమ్మిదిగంటల వరకు తెరచి ఉంటుంది.

గుణవంతేశ్వర ఆలయం

ఈ ఆలయం కూడ గోకర్ణ ఆత్మలింగానికి సంబంధించిన క్షేత్రంగా చెప్పబడుతోంది. ఇది గోకర్ణం నూంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం ఉదయం ఆరుగంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు తెరచిఉంటుంది.

మురుడేశ్వర ఆలయం

పంచలింగాల క్షేత్రాలలో ఇది కూడ ఒకటి. ఈ భారీ ఆలయం భక్తులను విపరీతంగా ఆకర్షిస్తుంటుంది. ఇది గోకర్ణక్షేత్రానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం ఆరు గంటల నుండి తెరచి ఉంటుంది.

1 కామెంట్‌:

  1. Please inform readers how to reach this place (or any other important place when you post about it) from major train stations in India and the nearest airport/Train etc. Then people will know where it is and how to go. Thanks

    రిప్లయితొలగించండి