దక్షిణ కాశి' ద్రాక్షారామం

దక్షిణ కాశి' ద్రాక్షారామం




ఈ ఆలయం చారిత్రక పరిశోధకులకు, చరిత్ర విద్యార్ధులకు ఒక గ్రంథాలయంగా ఉపయోగపడుతోంది. అడుగడుగునా శిల్పకళా నైపుణ్యం కానవచ్చే ఈ ఆలయాన్ని సందర్శించేందుకు రాష్ట్రం నుంచే కాక దేశం నలుమూలల నుంచి పర్యాటకులు, భక్తులు వస్తూ ఉంటారు.
ప్రకృతి రమణీయతకు ఆటపట్టయిన తూర్పుగోదావరి జిల్లాలో అడుగడుగునా గుడి ఉంది. అవి శతాబ్దాల కాలం నాటివి.అలాంటి పుణ్యక్షేత్రాల్లో ద్రాక్షారామం 'దక్షిణ కాశి'గా ప్రసిద్ధి చెందింది. ఇది చాలా పురాతనమైన ఆలయమనడానికి దాఖలాలుగా క్రీస్తు తరువాత 1080 నుంచి 1484 వరకూ గల శాసనాలు ఉన్నాయి. శాతవాహనుని కాలం నాటి హాలుని గ్రంథాల్లో ఈ ఆలయం ప్రస్తావన ఉంది.ఈ ఆలయం నిర్మాణం క్రీస్తు శకం 800 సంవత్సరంలో ప్రారంభించబడినట్టు భారత పురావస్తు పరిశోధనా సంస్థ రికార్డులు తెలియజేస్తున్నాయి.ఈ ఆలయానికి రెండు అంతస్తుల మండపం ఉంది. చాళుక్య భీముడు ఈ ఆలయాన్నీ, సామర్లకోటలోని భీమేశ్వరాలయాన్నీ నిర్మించాడన్న చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అందుకే ఈ ఆలయంలోని శివుడు భీమేశ్వరుడుగా ప్రాచుర్యం పొందాడు. ఈ ఆలయం చారిత్రక పరిశోధకులకు, చరిత్ర విద్యార్ధులకు ఒక గ్రంథాలయంగా ఉపయోగపడుతోంది. అడుగడుగునా శిల్పకళా నైపుణ్యం కానవచ్చే ఈ ఆలయాన్ని సందర్శించేందుకు రాష్ట్రం నుంచే కాక దేశం నలుమూలల నుంచి పర్యాటకులు, భక్తులు వస్తూ ఉంటారు. చోళులు, శాతవాహనులు,విజయనగర రాజులు ఈ ఆలయం అభివృద్ధికి ఎంతో కృషి చేశారు.ఈ ఆలయంలో కనిపించే శాసనాలన్నీ తెలుగు, సంస్కృతం,దేవనాగరి భాషల్లో ఉన్నాయి.
ఈ ఆలయానికి 40 కిలో మీటర్ల పరిధిలో 108 శైవాలయాలు ఉన్నాయి.
ద్రాక్షారామం పంచారామాల్లో ఒకటి. పూర్వం తారకాసురడనే రాక్షసుని కంఠంలో అమృత లింగాన్ని దేవతల మొరపై విచ్ఛిన్నం చేసినప్పుడు ఆ శివలింగం ఐదు చోట్ల ముక్కలుగా పడిందట. ఆ ఐదు ప్రదేశాలు పంచారామాలుగా ప్రసిద్ధి పొందాయి. అవే ద్రాక్షారామం, అమరారామం (అమరావతి), క్షీరారామం (పాలకొల్లు),సోమారామం (గునుపూడి భీమవరం), సామర్లకోటలోని భీమారామంగా ప్రసిద్ధి చెందాయి. ఈ ఆలయంపై వేములవాడ భీమకవి, శ్రీనాధుడు తమ రచనల్లో ప్రధానంగా ప్రస్తావన చేశారు. శ్రీనాధుడు భీమేశ్వర దండకం రాశాడు. ద్రాక్షారామ భీమేశ్వరుని సందర్శన భాగ్యం వల్ల తనకు కవిత్వం అబ్బిందని భీమకవి పేర్కొన్నాడు. దక్షుడు యజ్ఞం చేసిన ప్రదేశం కనుక ద్రాక్షారామమని పేరు వచ్చినట్టు పౌరాణిక గాధ. ఈ ఆలయంలో అమ్మవారి పేరు మాణిక్యాంబ.
అష్టాదశ శక్తి పీఠాల్లో మాణిక్యాంబ పీఠం ఒకటి. కార్తీక మాసంలో, శివరాత్రి ఉత్సవాల్లో ఈ ఆలయంలో విశేషంగా అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయం ప్రాంగణంలో శిల్పకళా సంపద చరిత్రకు దర్పణం పడుతుంది. ఈ ఆలయాన్ని సందర్శించే భక్తులు, పురావస్తు పరిశోధకులు తమకు తెలియకుండానే ఇక్కడ ఎక్కువ కాలాన్ని గడిపేస్తూ ఉంటారు. మాణిక్యాంబకు శరన్నవరాత్రి ఉత్సవాల్లో, శ్రావణ మాసాల్లో ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహిస్తారు. మాణిక్యాంబ అమ్మవారిని అర్చిస్తే పెళ్ళికాని ఆడపిల్లలకు వెంటనే పెళ్ళిళ్ళు జరుగుతాయన్న నమ్మకం భక్తుల్లో ఉంది. ద్రాక్షారామం రాజమండ్రికి 40 కిలో మీటర్ల దూరంలో ఉంది. కాగా, ద్రాక్షారామానికి అతి సమీపంలో కోటిపల్లి క్షేత్రం ఉంది. నాసికా త్రయింబకంలో పుట్టిన గోదావరి కోటి పల్లి వద్ద సముద్రంలో కలుస్తుంది. కోటిపల్లి తీర్థం ఘనంగాజరుపుతూ ఉంటారు. దక్షుని శాపానికి గురైన చంద్రుడు ఈ తీర్థంలో స్నానం చేసి తన ప్రకాశశక్తిని పొందినట్టు, ఇంద్రుడు ఇక్కడ స్నానం చేసి గౌతమ మహర్షి శాపం నుంచి విముక్తి పొందినట్టు పౌరాణిక గాధలు ప్రచారంలో ఉన్నాయి. కోటిపల్లి తీర్థం మీద ఎన్నో పాటలు, స్తోత్రాలు ఉన్నాయి. శైవ క్షేత్రాల్లో పేరెన్నిక గన్నది కోటిపల్లి. కాకినాడ-కోటిపల్లి రైల్వే లైను గురించి ప్రతి సంవత్సరం రైల్వే బడ్జెట్‌ సమయంలో ప్రస్తావనకు వస్తూ ఉంటుంది. ఏళ్ళు గడిచినా ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోవడం లేదు. మాజీ స్పీకర్‌ జిఎంసి బాలయోగి కృషి ఫలితంగా యానం నుంచి వెదుర్లంక వంతెన నిర్మాణం జరిగింది. కోనసీమకు తూర్పు డెల్టాకు మధ్య దూరాన్ని ఈ వంతెన తగ్గించింది. గతంలో రేవు దాటి వెళ్ళేవారు. ఇప్పుడు ఆటోలు,స్వంత వాహనాల్లో సులభంగా చేరుకోగలుగుతున్నారు. ద్రాక్షారామ, కోటిపల్లిలకు రవాణా సౌకర్యాలు పుష్కలంగా ఉన్నాయి. అను నిత్యం యాత్రికులతో ఈ 
క్షేత్రాలు అలరారుతూ ఉంటాయి.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి